హత్యాయత్నానికి పాల్పడిన కానిస్టేబుల్ అరెస్టు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ పరిధిలో తన సోదరిపై హత్యాయత్నానికి పాల్పడ్డ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కేలోతు రమేష్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
ఆర్థిక వివాదాల నేపథ్యంలో బలవంతంగా పురుగుల మందు తాగించి హత్యాయత్నం చేసినట్లు ఖానాపురం హవేలీ సీఐ బానుప్రకాష్ వెల్లడించారు. తన సోదరి బనోత్ పద్మ, ఆమె కుమార్తె గుగులోత్ వాణి వద్ద నుంచి నిందితుడు సుమారు 35 లక్షల రూపాయల నగదు, బంగారు ఆభరణాలను అప్పుగా తీసుకున్నాడు. ఈ సొమ్మును ఖమ్మంలో తన ఇంటి నిర్మాణానికి వినియోగించాడు. అప్పు తిరిగి ఇవ్వాలని బాధితులు పలుమార్లు కోరగా, రమేష్ నమ్మబలికి జూన్ 28న వారిని తన ఇంటికి పిలిపించాడు. అక్కడ బాధితులను అటకాయించి, వారి వద్ద ఉన్న నాలుగు ప్రామిసరీ నోట్లు, నాలుగు చెక్కులను బలవంతంగా లాక్కుని దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం తన ఇంటికి తిరిగి వెళ్తున్న పద్మను మార్గమధ్యలో అడ్డగించి, బలవంతంగా పురుగుల మందు తాగించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి జూలై 2న నిందితుడు రమేష్‌ను అరెస్టు చేశారు. నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, తదుపరి విచారణ కొనసాగుతోందని సీఐ బానుప్రకాష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 365/2026, అండర్ సెక్షన్ 308 (2), 118 (2), 115 (2) ఆర్/డబ్ల్యూ 3 (5) బీఎన్ఎస్ కింద కేసు నమోదైంది.

