సవాళ్లకు తగ్గట్టుగా పోలీసు పునర్వ్యవస్థీకరణ
ట్రాఫిక్, రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం
గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎస్ఐబీ నుంచి 513 మంది బదిలీ
డ్రగ్స్, సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్‌పై ప్రత్యేక దృష్టి
రెండు నెలల అటాచ్మెంట్ అనంతరం కొత్త బాధ్యతలు : డీజీపీ సీవీ ఆనంద్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : మారుతున్న నేర స్వభావం, ప్రజా భద్రతకు ఎదురవుతున్న కొత్త సవాళ్లకు అనుగుణంగా తెలంగాణ పోలీసు శాఖలో మానవ వనరులను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఒకప్పుడు వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం ప్రధాన సవాళ్లుగా ఉండగా.. ప్రస్తుతం డ్రగ్స్, సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్, పెట్టుబడి మోసాలు, ట్రాఫిక్, రోడ్డు భద్రత, ఆహార కల్తీ వంటి అంశాలు కీలక సవాళ్లుగా మారాయని పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎస్ఐబీ తదితర ప్రత్యేక విభాగాల నుంచి 513 మంది సిబ్బందిని ఎనిమిది విభాగాలకు అవసరాల మేరకు కేటాయించినట్లు డీజీపీ తెలిపారు. వీరిలో ఐదుగురు ఇన్స్పెక్టర్లు, 22 మంది ఎస్ఐలు, 14 మంది ఏఎస్ఐలు, 84 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 388 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. అత్యధికంగా 224 మందిని ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్డు భద్రత విభాగానికి కేటాయించారు. ఆహార కల్తీ, డ్రగ్ కంట్రోల్‌కు 80 మంది, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు 79 మంది, సివిల్ సప్లయిస్‌కు 28 మంది, డీజీపీ కార్యాలయం–టీ స్పార్క్‌కు 27 మంది కేటాయించారు. ఏసీబీ, సీఐడీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు 25 మంది చొప్పున కేటాయించారు.


రెండు నెలల అటాచ్మెంట్.. 11 రోజుల శిక్షణ
కొత్త బాధ్యతలు అప్పగించే ముందు సిబ్బందిని ఆయా విభాగాల్లో రెండు నెలలపాటు అటాచ్‌మెంట్‌పై పనిచేయించినట్లు సీవీ ఆనంద్ తెలిపారు. ప్రభుత్వ అనుమతితో పోస్టుల ఏర్పాటుకు అనుగుణంగా తుది కేటాయింపులు చేశామన్నారు. సిబ్బంది విద్యార్హతలు, అనుభవం, నేపథ్యాన్ని పరిశీలించడంతోపాటు వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు చెప్పారు. కొత్త విభాగాల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ అకాడమీలో 11 రోజుల ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు.
తీవ్రవాదం నుంచి సైబర్ నేరాల వరకు
1980, 1990 దశకాల్లో తెలంగాణలో వామపక్ష తీవ్రవాదం ప్రధాన సవాలుగా ఉండేదని డీజీపీ గుర్తుచేశారు. అప్పటి అవసరాలకు అనుగుణంగా 1987లో ప్రత్యేక పోలీసు విభాగం ఏర్పడి, అదే క్రమంలో గ్రేహౌండ్స్ రూపుదిద్దుకుందని తెలిపారు. గ్రేహౌండ్స్, ఎస్ఐబీ తదితర విభాగాలు మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణలో కీలక పాత్ర పోషించాయని చెప్పారు. 2017 తర్వాత తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. 2007లో హైదరాబాద్‌లో లుంబినీ పార్క్, చార్మినార్ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో కౌంటర్ టెర్రరిజం సామర్థ్యాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడిందని, దాని ఫలితంగానే ఆక్టోపస్ వంటి ప్రత్యేక విభాగాలు బలోపేతమయ్యాయని వివరించారు. యువతలో డ్రగ్స్ వినియోగం పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమని డీజీపీ అన్నారు. గతేడాది 835 మంది విద్యార్థుల్లో డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించినట్లు తెలిపారు. మరో విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అధ్యయనంలో సుమారు 70 శాతం మంది విద్యార్థులు డ్రగ్స్‌కు గురైనట్లు తేలిందని చెప్పారు. డ్రగ్స్ సరఫరా గొలుసును అడ్డుకోవడంతోపాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
సైబర్ నేరాల్లో రూ.1,750 కోట్ల నష్టం
ఆన్లైన్ బెట్టింగ్, పెట్టుబడి మోసాలు, నకిలీ యాప్‌ల ద్వారా జరుగుతున్న మోసాలతో సైబర్ నేరాలు ప్రధాన సవాలుగా మారాయని సీవీ ఆనంద్ తెలిపారు. గత ఏడాది రాష్ట్రంలో సైబర్ నేరాల కారణంగా సుమారు రూ.1,750 కోట్ల ఆర్థిక నష్టం జరిగినట్లు చెప్పారు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక విభాగాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాజా పునర్వ్యవస్థీకరణలో రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు డీజీపీ తెలిపారు. గత ఏడాది తెలంగాణలో రోడ్డు ప్రమాదాల్లో సుమారు 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణ, అమలును బలోపేతం చేసేందుకు 224 మందిని ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్డు సేఫ్టీ విభాగానికి కేటాయించినట్లు వెల్లడించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ఇంజినీరింగ్ లోపాలను సరిదిద్దేందుకు సంబంధిత శాఖలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. కొత్త బాధ్యతలు చేపడుతున్న సిబ్బంది నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని డీజీపీ సూచించారు. శారీరక దారుఢ్యాన్ని కాపాడుకోవడంతోపాటు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని చెప్పారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల్లో ఫీల్డ్ ఆపరేషన్లు, శిక్షణ తదితర అవసరాలకు సరిపడా సిబ్బందిని కొనసాగించినట్లు తెలిపారు. మూడు నెలల అనంతరం సిబ్బంది అవసరాలు, పనితీరును మరోసారి సమీక్షిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఆక్టోపస్, సీఐడీ, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ తదితర ప్రత్యేక విభాగాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

