మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలి
మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి
కాకతీయ,చేర్యాల : రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు వరిధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు.బుధవారం కొమురవెల్లి, చేర్యాల మండలాల్లోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కేంద్రాల్లో గన్నీ సంచులు, తూకం యంత్రాలు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని, కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటించాలని అధికారులకు ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కొమురవెల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్, చేర్యాల మండల అధ్యక్షుడు మంజ మల్లేశం, పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఐకేపీ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

