రూ.1.43 కోట్లతో నూతన ఆరోగ్య కేంద్రం నిర్మాణం
త్వరలో తహసీల్దార్ భవనం పూర్తి చేస్తాం
: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
కాకతీయ, పెద్దవంగర : మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా రూ.1.43 కోట్లతో నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు. బుధవారం పెద్దవంగర మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మించి, వైద్యులను నియమిస్తున్నామని చెప్పారు. వైద్యులు రోగులకు నాణ్యమైన సేవలు అందించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఈ ఆసుపత్రి ఎంతో ఉపయోగపడుతుందని, ఆధునిక సౌకర్యాలతో మెరుగైన వైద్యం అందుతుందని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని, ఎంపీడీఓ కార్యాలయం టెండర్ దశలో ఉందని ఎమ్మెల్యే తెలిపారు. మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అంతకుముందు మోత్య తండా నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు నెహ్రూ నాయక్, మండల అధ్యక్షుడు రంగు మురళి గౌడ్, సీనియర్ నాయకుడు ముద్దసాని సురేష్, సర్పంచ్ పారిజాత సురేష్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, మండల అధికారులు పాల్గొన్నారు.

