ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..!
కూలేందుకు సిద్ధంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్!
ఆకునూరులో 65 ఏళ్ల నాటి శిథిల స్తంభాలు
ప్రమాదం ముంచుకొస్తున్నా పట్టించుకోని అధికారులు
కాకతీయ,చేర్యాల : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ రైతులను భయాందోళనకు గురిచేస్తోంది. సుమారు 65 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన విద్యుత్ స్తంభాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో ఎప్పుడు కూలిపోతాయో తెలియని ప్రమాదకర పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కాలం చెల్లిన స్తంభాలపై ట్రాన్స్ఫార్మర్ కొనసాగుతుండటంతో ఏ సమయంలోనైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. పాత స్తంభాలను తొలగించి, కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి ట్రాన్స్ఫార్మర్ను పటిష్టంగా బిగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే.. ముందే మేల్కొని ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


