రాజీవ్ గాంధీ టౌన్‌షిప్‌లో పనులు పూర్తి చేయాలి
90 శాతం పూర్తయిన నిర్మాణ పనులు
మిగిలిన పనులకు వేగం పెంచాలి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
కాకతీయ, వరంగల్ : కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో భూములు కోల్పోయిన వారికి కేటాయించిన రాజీవ్ గాంధీ టౌన్‌షిప్‌లో మౌలిక వసతుల అభివృద్ధి పనుల త్వరితగతిన పూర్తి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులకు సూచించారు. రాజీవ్ గాంధీ టౌన్‌షిప్‌లో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై శుక్రవారం వారు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ భవనం, ప్రభుత్వ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వెటర్నరీ ఆసుపత్రి తదితర మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన నిర్మాణ పనులను సమీక్షించారు. ఇప్పటికే చేపట్టిన నిర్మాణ పనులు సుమారు 90 శాతం పూర్తయ్యాయని అధికారులు వివరించారు. మిగిలిన పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఎమ్మెల్యే, కలెక్టర్ సూచించారు. రాజీవ్ గాంధీ టౌన్‌షిప్‌లో నివసించే ప్రజలకు విద్య, వైద్యం, ఇతర ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండేలా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని పేర్కొన్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) ఎల్. కిషోర్ కుమార్, (లోకల్ బాడీస్) వై.వి. గణేష్, జోనల్ మేనేజర్ స్వామి, డీఆర్వో విజయలక్ష్మి, వరంగల్ ఆర్డీవో సుమ,గీసుకొండ తహసిల్దార్ రియాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

