అడవి దున్నను హతమార్చిన వేటగాళ్లు
విద్యుత్ షాక్‌తో వన్యప్రాణి వేట.. మాంసం విక్రయం
సీసీ కెమెరాలతో ఏడుగురి ముఠా గుర్తింపు
ఐదుగురి అరెస్టు.. పరారీలో మరో ఇద్దరు నిందితులు
కాకతీయ, ములుగు : అభయారణ్యంలో అడవి దున్నను విద్యుత్ షాక్‌తో హతమార్చి మాంసం విక్రయించిన ఐదుగురిని అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. మొత్తం ఏడుగురి సభ్యులను గుర్తించి ఐదుగురిని అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ములుగు జిల్లా పస్రా వన్యప్రాణి నిర్వహణ పరిధిలోని మెట్లగూడెం, గోనెపల్లి ప్రాథమిక బీట్ ప్రాంతాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. ములుగు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఖమ్మం కేంద్ర కారాగారానికి తరలించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు. అభయారణ్యంలో అనుమతి లేకుండా ప్రవేశించడం, వన్యప్రాణులను వేటాడటం, వాటికి హాని కలిగించడం వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం నేరమని అటవీ అధికారులు హెచ్చరించారు. అభయారణ్యంలోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా కొనసాగుతోందని, అక్రమంగా ప్రవేశించినా, వేటకు పాల్పడినా ఆధారాల మేరకు చర్యలు తప్పవని స్పష్టం చేశారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనుమతి లేకుండా అడవిలోకి వెళ్లవద్దని, వన్యప్రాణుల సంరక్షణకు సహకరించాలని కోరారు. ఈ కేసు దర్యాప్తులో వన్యప్రాణి క్షేత్రాధికారి హట్కర్ రమేష్, సెక్షన్ అధికారి ఆదినారాయణ, బీట్ అధికారులు పావని, రంజిత్ నాయక్, వినోద్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.

