అలుపెరుగని పోరాటయోధుడు నల్లా నర్సింహులు!
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో స్ఫూర్తిదాయక ప్రస్థానం
వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చకిలం ఉపేందర్
కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో టైగర్ నల్లా నర్సింహులు అలుపెరుగని పోరాటయోధుడని వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చకిలం ఉపేందర్ అన్నారు. గురువారం హనుమకొండలో వరంగల్, హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన నల్లా నర్సింహులు 33వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నల్లా నర్సింహులు పోరాట స్ఫూర్తిని నేటి తరం అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ బార్ కౌన్సిల్ సభ్యుడు దుస్సా జనార్దన్ మాట్లాడుతూ నిరంకుశ విస్నూరు దొర, భూస్వాముల ఆగడాలను ఎదిరించి నల్లా నర్సింహులు ఎన్నో కేసులు ఎదుర్కొన్నారని, ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తొర్రూరు బార్ అధ్యక్షుడు వీర వెంకటరత్నం, ఐఎల్పీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్, వరంగల్ బార్ మాజీ అధ్యక్షుడు వలుస సుధీర్ ఆయన పోరాటాలను వివరించారు. మూడుసార్లు ఉరిశిక్ష విధించినా వెనుకడుగు వేయలేదని, భార్య వజ్రమ్మ కూడా ఉద్యమంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నారని వలుస సుధీర్ పేర్కొన్నారు. జైలులో ఉన్నప్పుడే వజ్రమ్మ ఆడశిశువుకు జన్మనిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. బహుజనులు తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని వక్తలు పిలుపునిచ్చారు. నల్లా నర్సింహులు చరిత్రను భావితరాలకు అందించేందుకు కృషి చేస్తున్న సామాజికవేత్త దాసరి జనార్దన్‌ను చకిలం ఉపేందర్ శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఇరు బార్ అసోసియేషన్ల కార్యదర్శులు ఆర్. నాగేంద్రచారి, ఊరుగొండ నరేందర్, ఉపాధ్యక్షురాలు వి. లలితకుమారి, సీనియర్ న్యాయవాదులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

