వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను గడువులోగా సాధించాలి
డాక్టర్ అప్పయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
మందుల నిల్వలు, రికార్డుల నిర్వహణపై ఆరా
కొండపర్తి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ
కాకతీయ, హన్మకొండ : ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య వైద్య సిబ్బందిని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. ఈ మేరకు ఆయన కొండపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. తనిఖీలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వివిధ రిజిస్టర్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫార్మసీ స్టోర్‌ను సందర్శించి మందుల నిల్వలు, పంపిణీ రికార్డులు, వాటి నిర్వహణ తీరును తనిఖీ చేశారు. రోగులకు అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, మందుల పంపిణీ వివరాలు, ఇతర రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు.
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్ష
అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. మాతా శిశు ఆరోగ్య సేవలు (ఎంసీహెచ్), సాధారణ టీకాల కార్యక్రమం, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, జాతీయ అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం (ఎన్సీడీ), టీబీ ముక్త్ భారత్, హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణ కార్యక్రమాలతో పాటు జాతీయ వెక్టర్ ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, ప్రతి జాతీయ ఆరోగ్య కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని డాక్టర్ అప్పయ్య వైద్యాధికారి, సిబ్బందికి ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో బాధ్యతగా వ్యవహరించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు.

