ఉద్యోగాలు సాధించే వరకు పోరాటం ఆగదు!
కోచ్ ఫ్యాక్టరీ భూ నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలి
సీపీఎం మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య
కాకతీయ, మడికొండ : రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన అయోధ్యపురం రైతులకు ఉద్యోగాలు కల్పించే వరకు సీపీఎం పోరాటం కొనసాగిస్తుందని పార్టీ మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య స్పష్టం చేశారు. శనివారం అయోధ్యపురంలో భూ నిర్వాసిత రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూములు సేకరించే సమయంలో ప్రతి రైతు కుటుంబానికి కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, పిల్లల భవిష్యత్తు, కుటుంబాల అభివృద్ధిపై ఆశతో రైతులు తమ భూములను అప్పగించారని తెలిపారు. ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయి డిసెంబర్లో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నా, ఇచ్చిన హామీ మాత్రం నెరవేరలేదని విమర్శించారు. పలుమార్లు నిరసనలు, వినతులు చేసినా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదన్నారు.
110 మంది భూ నిర్వాసితులకు ఉద్యోగాలివ్వాలి
భూములు కోల్పోయిన 110 మంది రైతు కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు స్థానిక నిరుద్యోగ యువతకు, రైల్వేలో అప్రెంటిస్ చేసిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని సాంబయ్య డిమాండ్ చేశారు. రైల్వే డివిజన్ సాధన కోసం కూడా ఉద్యమిస్తామని తెలిపారు. రైతులను ఐక్యం చేసి ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి పోరాట ప్రణాళిక రూపొందిస్తామని, అవసరమైతే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవాన్ని అడ్డుకునేందుకూ సిద్ధమని హెచ్చరించారు. సమావేశంలో సీపీఎం మండల నాయకుడు కాదాసి రామస్వామి, భూ నిర్వాసిత రైతులు సాగరం ప్రదీప్‌కుమార్, ఉప్పు వెంకటేష్, వెల్లిశోజు శ్రీనివాస్, పూల మణికంఠ, వెల్ఫేర్ శ్రీనివాస్, కాయిత పర్వతాలు, మామిళ్ల మల్లయ్య, ప్రశాంత్, గాదం విజయ్‌కుమార్, శేషు, దుపెల్లి సురేష్, తేజ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

