నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి కార్తీక మాస పూజలు
కాకతీయ, గీసుగొండ: కార్తీక మాస మొదటి మంగళవారాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన నాగ సుబ్రహ్మణ్యేశ్వరునికి కార్తీక మాస ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని ఊకల్ హవేలీ గ్రామంలో కొలువుదీరిన శ్రీవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనా చార్యులు స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించి,వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. కార్తీక మాస మొదటి మంగళవారం కావడంతో జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వరరావు, సర్పంచ్ కక్కెర్ల సుభాష్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


