డీలిమిటేషన్లో అన్యాయం జరిగితే ఊరుకోం
టీపీసీసీ సభ్యుడు రంజిత్ రెడ్డి
కాకతీయ, నెక్కొండ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న డీలిమిటేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు .తెలంగాణకు అన్యాయం జరిగితే సహించబోమని, అవసరమైతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. నెక్కొండలోని విశ్రాంతి భవనంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లావుడియా తిరుమల్ చౌహన్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో పలువురు నేతలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. టీపీసీసీ సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ డిలిమిటేషన్ పేరుతో దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణ హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. అన్యాయం జరిగితే తీవ్రంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి మాట్లాడుతూ 2027లో చేపట్టే జనగణనతో పాటు కుల గణన కూడా నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీసీల సామాజిక న్యాయం కోసం ఇది అత్యవసరమని పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బక్కి అశోక్ మాట్లాడుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజనను భారత్ పాకిస్తాన్తో పోల్చడం అవివేకమని మండిపడ్డారు.నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తున్నప్పటికీ, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉపకోటలు తప్పనిసరిగా కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కుసుమ చెన్నకేశవులు, పట్టణ అధ్యక్షుడు ఈదునూరి సాయి కృష్ణ, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొణిజేటి భిక్షపతి, కోశాధికారి కొల్లి సుబ్బారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సింగం ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

