డయాలసిస్ సెంటర్లపై క్రెడిట్ ఫైట్
సోషల్ మీడియాలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ పోటాపోటీ పోస్టులు
కాకతీయ, హుజురాబాద్ : జమ్మికుంట, కమలాపూర్ ప్రభుత్వ దవాఖానల్లో డయాలసిస్ సెంటర్ల మంజూరుపై రాజకీయంగా క్రెడిట్ పోటీ తీవ్రరూపం దాల్చింది.హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కృషితోనే ఈ సదుపాయం సాధ్యమైందని ఆయన అనుచరులు పేర్కొంటుండగా, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ నిరంతర ప్రయత్నాల వల్లే ఈ కేంద్రాలు మంజూరయ్యాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. డయాలసిస్ సెంటర్ల అవసరాన్ని గుర్తించి తామే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు ఇరువర్గాలు తమ ప్రకటనల్లో వెల్లడించాయి. పేద రోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందాల్సిన ఇబ్బందులను వివరించి చర్యలు తీసుకునేలా ఒత్తిడి తెచ్చామని వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడినప్పటికీ, అసలు ఈ సదుపాయం కోసం కృషి చేసినది ఎవరో అన్నదానిపై స్పష్టత లేకుండా ఉంది.
ప్రజల్లో గందరగోళం.. అయినా సంతోషం
ఇక మరోవైపు, డయాలసిస్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్న పేద రోగులకు ఈ సెంటర్లు ఎంతో ఉపయుక్తంగా మారనున్నాయి. అయితే నాయకులు ఎవరిది వారే చెప్పుకుంటుండటంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. “ఈ సెంటర్లను నిజంగా తీసుకొచ్చింది ఎవరు?” అనే సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. అయినప్పటికీ, తమ ప్రాంతంలోనే వైద్య సదుపాయం అందుబాటులోకి రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

