కాంగ్రెస్ పాలనలో గ్రామాభివృద్ధి శూన్యం
వడ్డేకొత్తపల్లి సర్పంచ్ దంతాలపల్లి పర్శరాములు
కాకతీయ, పెద్దవంగర : రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాభివృద్ధి పూర్తిగా శూన్యమైందని వడ్డేకొత్తపల్లి సర్పంచ్ దంతాలపల్లి పర్శరాములు విమర్శించారు. సోమవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం వడ్డే కొత్తపల్లి గ్రామంలో ఝాన్సీ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారంతా గతంలో స్థానిక పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేసిన వారేనన్నారు. ఇప్పుడు వారు బీఆర్ఎస్ నుంచి వెళ్లినట్టు చూపిస్తూ కండువాలు కప్పుకోవడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. అలాంటి వారిని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు చేసిన అభివృద్ధిని చూసే ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. వారు చేపట్టిన అభివృద్ధి పనులే గ్రామాల్లో కనిపిస్తున్నాయని, గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు ఎక్కడా కనిపించడం లేదని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, అభివృద్ధి కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కుమారస్వామి, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు రామరాజు, యాకన్న, మల్లేష్, శ్రీనివాస్, నవీన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

