ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్లో ఉంచొద్దు
కలెక్టర్ చిత్రా మిశ్రా
కాకతీయ, కరీంనగర్/ కలెక్టరేట్ : ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే స్థానిక సంస్థలు, ఆర్డీవోలు రమేష్ బాబు, మహేశ్వర్లతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 238 దరఖాస్తులు అందగా, అందులో అత్యధికంగా కరీంనగర్ నగరపాలిక సంస్థ పరిధి నుంచి 59 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. ప్రతి దరఖాస్తును బాధ్యతగా తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు న్యాయం జరిగేలా సమయపాలనతో సేవలు అందించాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

