చదువుకున్న కాలేజీకే ‘చీఫ్ గెస్ట్’గా
అప్పాయిగూడెం సర్పంచ్ భావోద్వేగం
విద్యార్థులతో పాత జ్ఞాపకాలను పంచుకున్న సర్పంచ్ దండు ప్రవీణ్
ఘనంగా ప్రారంభమైన స్పెషల్ సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్
139 మంది మైనారిటీ విద్యార్థినుల భాగస్వామ్యం
కాకతీయ, కారేపల్లి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘99 రోజుల యాక్షన్ ప్లాన్ – ప్రజా పాలన’లో భాగంగా అప్పాయిగూడెం పరిధిలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ & జూనియర్ కాలేజీలో మంగళవారం “స్పెషల్ సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్” అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అప్పాయిగూడెం సర్పంచ్ దండు ప్రవీణ్ ముఖ్యఅతిథిగా హాజరై క్రీడా శిబిరాన్ని ప్రారంభించారు. క్రీడా శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం సర్పంచ్ దండు ప్రవీణ్ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తాను విద్యార్థిగా చదువుకున్న ఇదే ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణానికి, నేడు సర్పంచ్ హోదాలో ముఖ్యఅతిథిగా రావడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని కొనియాడారు. విద్యార్థి దశలో తాను గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ, క్రమశిక్షణతో చదివితే ఎవరైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు.
క్రీడలతోనే మానసిక ఉల్లాసం..
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి వేసవి శిబిరాలను ఏర్పాటు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ మైనారిటీ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు క్రీడలు కూడా మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి తోడ్పడతాయని తెలిపారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నందున విద్యార్థినులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆటల సమయంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలని సూచించారు. మెనూ చార్ట్ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజన వసతులు కల్పించాలని, పాఠశాలలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని నిర్వాహకులను ఆదేశించారు. ఈ సమ్మర్ క్యాంప్‌లో మొత్తం 139 మంది విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎండీ. ముజాహిద్, ప్రాంతీయ సమన్వయకర్త అరుణ కుమారి, విజిలెన్స్ అధికారి సీతారాములు, ప్రిన్సిపాల్ డి. సావిత్రి, కాంగ్రెస్ నాయకులు పాల్తీయ శివాజీ, పీఈటీలు, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

