ఖానాపూర్ ఆయకట్టు రోడ్డుకు ఊరట
గుంతల పూడ్చివేత పనులు ప్రారంభం
గ్రామ పంచాయతీ నిధులతో మరమ్మతులు
రైతులు, వాహనదారుల ఇబ్బందులు తొలగించేలా చర్యలు
కాకతీయ, ఖానాపూర్: ఖానాపూర్ మండల కేంద్రం నుండి పెద్దమ్మగడ్డ, మనుబోతులగడ్డ గ్రామాలకు వెళ్లే ఆయకట్టు డాంబారు రోడ్డు ప్రయాణికులకు ఇకపై సుఖమయం కానుంది. గత కొంతకాలంగా ఈ రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతల కారణంగా ప్రజలు, ముఖ్యంగా పొలాలకు వెళ్లే రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన సర్పంచ్ దాసరి రమేష్, మంగళవారం మరమ్మతు పనులను ప్రారంభించారు. గ్రామ పంచాయతీ నిధులతో ఈ రోడ్డులోని గుంతలను పూడ్చివేసే పనులు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజల సౌకర్యార్థం, రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టినట్లు తెలిపారు. రోడ్డు దుస్థితిపై ఆందోళన చెందుతున్న రెండు గ్రామాల ప్రజలు, ఈ పనులు ప్రారంభం కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప్పు రాజు, వార్డు సభ్యులు గుండ్లపల్లి విజయ్, వేములపల్లి వెంకటప్రసాద్ రావు, ఆజాహర్ పాల్గొన్నారు. అలాగే నాయకులు మచ్చిక అశోక్, వల్లేపు శ్రీనివాస్, కామిశెట్టి సుధీర్, భూక్య నవీన్, చాగంటి వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

