డంపింగ్ యార్డ్‌పై 24 గంటల డెడ్‌లైన్
ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే ఆందోళనలు తీవ్రం
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే బీజేపీ ఊరుకోదు
బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హెచ్చరిక
సిర్సపల్లి శివారులో డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని డిమాండ్
హుజురాబాద్‌లో నెలకొన్న ఉద్రిక్తత.. ప్రభుత్వంపై పెరిగిన ఒత్తిడి
కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ రూరల్ మండలం సిర్సపల్లి శివారులో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హుజురాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి 24 గంటల డెడ్‌లైన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ గడువులోగా డంపింగ్ యార్డ్ రద్దుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
నెల రోజులుగా నిరసనలు..
డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు గత నెల రోజులుగా నిరాహార దీక్షలు, ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంపై కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ప్రజల గోడును పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయి తప్ప ప్రజల సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధి చూపడం లేదు” అని ఆయన మండిపడ్డారు.స్థానిక మున్సిపల్ పాలకవర్గం మరియు కాంగ్రెస్ నాయకులు డంపింగ్ యార్డ్ రద్దు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. అధికారులు కూడా వాస్తవాలను దాచిపెట్టి ప్రభుత్వానికి అనుకూలంగా తప్పుడు సమాచారం ఇస్తున్నారని విమర్శించారు. జనావాసాల మధ్య డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, అన్నదాతల భూములు కలుషితమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యమ కార్యాచరణ..
ప్రభుత్వం మొండివైఖరిని విడనాడి వెంటనే డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన బీజేపీ నిలబడి ఈ పోరాటాన్ని చివరి వరకు తీసుకెళ్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.

