గోదాంలో గోల్ మాల్
– 200 బస్తాల ప్రభుత్వ బియ్యం మాయం
– సిబ్బంది చేతి వాటం అధికారుల అండదండలున్నట్లు ఆరోపణలు…
– దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజల డిమాండ్…
కాకతీయ, దుగ్గొండి: ప్రజా పంపిణి నిల్వల వ్యవస్థ పక్కదారి పట్టింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చలపర్తి గోదాంలో ప్రభుత్వ పంపిణి బియ్యం నిల్వల వ్యవహారం స్థానికంగా సంచలనం రేపిన ఘటనలో, ప్రభుత్వ గోదాంలో భారీ స్థాయిలో బియ్యం గల్లంతైన విషయం వెలుగులోకి వచ్చింది.విశ్వాసనీయ సమాచారంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులతో ఈ లోటు బయటపడినట్టు సమాచారం. సుమారు 200 బస్తాల బియ్యం కనిపించకుండా పోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
రికార్డుల్లో ఉన్న నిల్వలతో వాస్తవంగా ఉన్న బస్తాల సంఖ్య సరిపోలకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై గోదాం సిబ్బందిని విచారించగా సరైన సమాధానాలు రాకపోవడంతో విషయం మరింత తీవ్రమైంది.
స్థానిక అధికారులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఇది సిబ్బంది నిర్లక్ష్యమా, లేక ఉద్దేశపూర్వకంగా జరిగిన అక్రమమా అన్న దానిపై పరిశీలన కొనసాగుతోంది. ఈ ఘటనతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్లో ఇలాంటి అవకతవకలు జరగడం ఆందోళన కలిగిస్తోందని స్థానికులు పేర్కొన్నారు. సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

