గిరిజన అభ్యున్నతే ప్రధాన లక్ష్యం
ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి
ఏటూరునాగారం ఐటీడీఏ ఏపీఓ కొమురం నాగరావు
కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : గిరిజనుల అభ్యున్నతే తన ప్రధాన లక్ష్యమని ఏటూరునాగారం ఐటీడీఏ ఏపీఓ కొమురం నాగరావు పేర్కొన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన తుడుందెబ్బ నాయకులు ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హుడికి చేరేలా ప్రత్యేక కృషి చేస్తానని ఏపీఓ కొమురం నాగరావు తెలిపారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నానని హామీ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, రహదారులు, తాగునీటి వంటి ప్రాథమిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం తీసుకునే చర్యలు ప్రజలకు మేలు చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అభివృద్ధి పనుల వేగవంతం
ముఖ్యంగా గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం మరియు ఆశ్రమ పాఠశాలల పరిస్థితిని మెరుగుపరచడం అత్యవసరమని తుడుందెబ్బ నాయకులు ఏపీఓకు వివరించారు. ఐటీడీఏ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ మండల అధ్యక్షుడు తాటి నీలాద్రి, జిల్లా కోశాధికారి సోలం సురేష్, మండల ప్రధాన కార్యదర్శి ఈసం పణికుమార్, ఉపాధ్యక్షులు కోరం సుధాకర్, చింత లక్ష్మణ్ స్వామి, బొగ్గం శివకుమార్, పలక నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

