ఆర్టీసీ సమ్మెకు బీజేపీ మద్దతు
ప్రభుత్వంపై గోగుల రాణా ప్రతాప్ రెడ్డి విమర్శలు
హామీలు అమలు చేయాలని డిమాండ్
కాకతీయ, నర్సంపేట టౌన్: రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో పీఆర్సీ విషయంలో జరిగిన అన్యాయమే ఇప్పుడు కూడా పునరావృతమవుతోందని మండిపడ్డారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ కార్మికుల పట్ల ఒకే తీరుగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న వేతన సవరణను వెంటనే చేపట్టాలని, కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షుడు తనుగుల అంబేద్కర్, సీనియర్ నాయకులు గడ్డం ఆంజనేయులు, కుంభం కోమల్ రెడ్డి, మల్యాల వినయ్ కుమార్, మాజీ కౌన్సిలర్ జుర్రు రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు గంగిడి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

