కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి
పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపు
కాకతీయ, గీసుగొండ: బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా కృషి చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండలోని తన నివాసంలో గీసుగొండ ఉమ్మడి మండల బిఆర్ఎస్ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా పార్టీ పరిస్థితులను సమీక్షిస్తూ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులకు రుణమాఫీ, యువతకు ఉద్యోగాలు, మహిళలకు భరోసా వంటి కీలక అంశాల్లో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి మందగించిందని, సంక్షేమ పథకాలు నిలిచిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మోసాలను గ్రామస్థాయిలో ప్రజలకు వివరించి, పార్టీకి అండగా నిలిచేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎనమాముల మార్కెట్ మాజీ చైర్మన్ చింతం సదానందం, మాజీ జెడ్పిటిసి పోలీసు ధర్మారావు, గోలి రాజయ్య, దొంగల రమేష్, ముంత రాజయ్య, బోడకుంట్ల ప్రకాష్, బెంబిరి బాబురావు, అంకతి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

