మద్దతు ధరతోనే ధాన్యం కొనుగోళ్లు
రైతుల ఖాతాల్లోకే నేరుగా నగదు జమ
ఐకేపీ కేంద్రాలను ప్రారంభించిన మార్కెట్ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి
కాకతీయ, రాయపర్తి: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరతోనే కొనుగోలు చేస్తుందని ఇల్లంద వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. గురువారం మండలంలోని మొరిపిరాల, కృష్ణాపురం, వాంకుడోత్ తండా, పోతిరెడ్డిపల్లి, జింకురాం తండా, ఎర్రకుంట తండా, గన్నారం, రాయపర్తి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రైతులు తొందరపడి దళారులకు ధాన్యం అమ్మి నష్టపోవద్దని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధాన్యంలో తేమ శాతం 17 లోపు ఉండేలా చూసుకోవాలని, తాలు, చెత్తాచెదారం లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం మొదటి రకానికి రూ. 2,389, సాధారణ రకానికి రూ. 2,369 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ అవుతుందని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్యా నాయక్, ఏపీఎం రవీందర్, ఏఈఓలు, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు మరియు రైతులు పాల్గొన్నారు.

