విద్యార్థుల సమస్యలపై బీఆర్‌ఎస్‌వీ పోరుబాట
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి
ప్రభుత్వ తీరుతో 13 లక్షల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకం
మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
కాకతీయ, హనుమకొండ: రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పోరాటాలకు శ్రీకారం చుట్టనున్నట్లు బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. హనుమకొండ జిల్లా కోఆర్డినేటర్ గండ్రకోట రాకేష్ యాదవ్ ఆధ్వర్యంలో వడ్డేపల్లిలోని తన నివాసంలో ‘పోరుబాట’ గోడపత్రికను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం సుమారు రూ. 8 వేల కోట్ల బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వినయ్ భాస్కర్ విమర్శించారు. “నిధుల విడుదల లేక కాలేజీలకు ఫీజులు చెల్లించలేక విద్యార్థులు సతమతమవుతున్నారు. దాదాపు 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడింది” అని ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యాలకు నిధులు అందకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీనివల్ల పైచదువులకు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం..
విద్యార్థి లోకం పక్షాన నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్‌ఎస్వీ కార్యాచరణ సిద్ధం చేసిందని, బకాయిలు చెల్లించే వరకు విశ్రమించబోమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల శరత్ చంద్ర, హనుమకొండ జిల్లా కోఆర్డినేటర్ బైరపాక ప్రశాంత్, రూరల్ జిల్లా కోఆర్డినేటర్ రఘుపతి, నాయకులు వీరస్వామి, కోరపెల్లి రాజేష్, ఐలోని అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.

