బావిలో పడి వివాహిత మృతి
దేవరుప్పుల మండలం కొలుకొండలో విషాదం
కాకతీయ, దేవరుప్పుల : మండలంలోని కొలుకొండ గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ప్రమాదంలో ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. ఉపాధి హామీ పనులకు వెళ్లిన సమయంలో నీరు తాగేందుకు బావి వద్దకు వెళ్లి కాలుజారి పడటంతో ఈ విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పన్నీరు వైదేహి (25) ఎనిమిదేళ్ల క్రితం రాజు అనే వ్యక్తితో వివాహం జరిగింది.
ఆదివారం ఉదయం వైదేహి తన భర్తతో కలిసి గ్రామ పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు వెళ్లింది. పనిలో ఉండగా దాహం వేయడంతో సమీపంలోని బావి వద్దకు వెళ్లింది. అక్కడ నీరు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి లోతైన బావిలో పడిపోయింది. గమనించిన స్థానికులు, తోటి కూలీలు వెంటనే స్పందించి ఆమెను బయటకు తీశారు. కొనఊపిరితో ఉన్న వైదేహిని ట్రాక్టర్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా, పరిస్థితి విషమించి మార్గమధ్యలోనే మృతి చెందింది. యంగ్ వివాహిత మృతితో కొలుకొండలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతురాలి తల్లి రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

