మెడికవర్ ఎదుట మృతుడి బంధువుల ఆందోళన
వైద్యుడి నిర్లక్ష్యంతోనే ప్రాణం పోయిందంటూ నిరసన
బెదిరింపులకు దిగిన భద్రతా సిబ్బంది?
కాకతీయ, హనుమకొండ: వరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి మృతి చెందడం ఉద్రిక్తతకు దారితీసింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ మనిషి ప్రాణం పోయిందని ఆరోపిస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ జిల్లా పాకాల మండలం వెలిబెల్లి గ్రామానికి చెందిన బొజ్జ జంపయ్య కడుపునొప్పితో ఈ నెల 25న నగరంలోని మెడికవర్ ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం వహించారని బంధువులు ఆరోపిస్తున్నారు. రోగిని చూసేందుకు వెళ్లిన తమను ఆసుపత్రి సిబ్బంది అడ్డుకున్నారని, జంపయ్య ఆరోగ్య పరిస్థితిపై అడిగినా స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రోగి పరిస్థితిపై ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించిన సమయంలో భద్రతా సిబ్బంది తమతో వాగ్వాదానికి దిగారని బంధువులు తెలిపారు. అక్కడ పనిచేస్తున్న ఒక వ్యక్తి తాను గతంలో పోలీసు అధికారిగా పనిచేశానని చెబుతూ తమను భయపెట్టేందుకు ప్రయత్నించారని బాధితులు ఆరోపించారు. ఈ క్రమంలోనే రాత్రి సమయంలో జంపయ్య మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

