మామునూరు విమానాశ్రయానికి ప్రత్యేక డిజైన్
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏఏఐ అధికారుల పరిశీలన
చారిత్రక కట్టడాల వైభవాన్ని తిలకించిన ఉన్నతాధికారులు
కాకతీయ, వరంగల్: వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ పనులు వేగవంతం చేసే దిశగా ముందడుగు పడింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ జి. సంధ్య రాణితో కలిసి మామునూరు ఎయిర్పోర్ట్ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విమానాశ్రయానికి ప్రత్యేక డిజైన్ రూపకల్పనలో భాగంగా రన్వే మరియు ఇతర వసతులపై అధికారుల బృందం సమీక్ష నిర్వహించింది.
విమానాశ్రయ స్థల పరిశీలన అనంతరం ఏఏఐ ఈడీ ఎస్.కె. గుప్తా, జై గౌరవ్ చౌదరి, జేజీఎం బాలేందర్ కుమార్ తివారి, కేజీఎం గోపాలకృష్ణల బృందం పద్మకోటలోని కీర్తి తోరణం, ఏకశిల గుట్టలోని స్వయంభూ దేవాలయాన్ని సందర్శించింది. కాకతీయుల కాలం నాటి రాతి మరియు మట్టి కట్టడాలను చూసి అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాకతీయ శిల్పకళా వైభవం అద్భుతమని కొనియాడారు.
పర్యాటక ప్రాంతాల సందర్శన..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను కూడా ఈ బృందం పరిశీలించింది. జిల్లాలో విమానాశ్రయం అందుబాటులోకి వస్తే పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ పర్యటనలో రెవెన్యూ మరియు పర్యాటక శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.

