200 యూనిట్లలోపు వాడితే ‘జీరో’ బిల్లు
కాకతీయ, ఏటూరునాగారం రూరల్: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఆకులవారి గణపురంలో ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ వైర్లను అధికారులు మంగళవారం యుద్ధ ప్రాతిపదికన సరిచేశారు. స్థానిక వార్డు సభ్యుడు నగవతి కిరణ్ అందించిన సమాచారంతో స్పందించిన విద్యుత్ శాఖ డీఈ, సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం గృహ అవసరాలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి ‘జీరో బిల్లు’ పథకాన్ని అమలు చేస్తోందని గుర్తుచేశారు. ఈ ప్రయోజనాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా, మండల పరిధిలో తుప్పు పట్టిన విద్యుత్ స్తంభాలు, ఎత్తు తక్కువగా ఉన్న పోల్స్ స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు అంచనాలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులు రూ. 9,200 డిమాండ్ డ్రాఫ్ట్ చెల్లిస్తే, కిలోమీటర్ పరిధిలో ఉచిత విద్యుత్ సరఫరాతో పాటు అవసరమైన చోట ట్రాన్స్ఫార్మర్ సౌకర్యం కూడా కల్పిస్తామని అధికారులు తెలిపారు. విద్యుత్ వినియోగం కచ్చితంగా మీటర్ల ద్వారానే జరగాలని, అక్రమ కనెక్షన్లు ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు శాఖాపరంగా కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది మరియు స్థానికులు పాల్గొన్నారు.

