చెక్‌పోస్టు వద్ద ‘నీటి’ కష్టాలు
నిరుపయోగంగా లక్ష రూపాయల వాటర్ ప్లాంట్
అటవీ శాఖ నిర్లక్ష్యంపై సిబ్బంది, బాటసారుల ఆగ్రహం
కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షల రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన వాటర్ ప్లాంట్ నిరుపయోగంగా మారింది. ఏటూరునాగారం మండల పరిధిలోని చిన్నబోయినపల్లి – ఏటూరునాగారం మధ్య గల జాతీయ రహదారి అటవీ చెక్‌పోస్ట్ వద్ద ఏడాది క్రితం ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ గత రెండు నెలలుగా మరమ్మతులకు గురై మూలన పడింది. వేసవి తీవ్రత దృష్ట్యా తాగునీరు ఎంతో అవసరమైన సమయంలో అధికారులు దీన్ని పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహించే సిబ్బంది తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాహార్తిని తీర్చుకోవడానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటూరునాగారం వెళ్లి ప్రైవేట్ ప్లాంట్ల నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. చెక్‌పోస్ట్ మీదుగా ప్రయాణించే బాటసారులు సైతం నీటి చుక్క దొరకక అవస్థలు పడుతున్నారు.
హామీలు గాలికి..
ప్లాంట్ ఏర్పాటు సమయంలో నిరంతరం శుద్ధమైన తాగునీరు అందుబాటులో ఉంటుందని, గ్రామస్థులు కూడా ఉచితంగా వినియోగించుకోవచ్చని అటవీ శాఖ అధికారులు గొప్పగా చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆ హామీలు గాలికి ఎగిరిపోయాయని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, వెంటనే ప్లాంట్‌కు మరమ్మతులు చేయించి తాగునీటి సౌకర్యాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు.

