గ్యాస్ కష్టాలు
అర్ధరాత్రి నుంచే క్యూలైన్లు..
నర్సింహులపేటలో వినియోగదారుల ధర్నా
ఏజెన్సీల ఎదుట బారులు తీరిన జనం
బుకింగ్ చేసినా అందని సిలిండర్లు
జాతీయ రహదారిపై రాస్తారోకో.. నిలిచిన రాకపోకలు
కాకతీయ, వరంగల్ బ్యూరో : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రరూపం దాల్చింది. సకాలంలో గ్యాస్ అందక, ఏజెన్సీ నిర్వాహకుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వినియోగదారులు శనివారం జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. సిలిండర్లను రోడ్డుపై అడ్డంగా పెట్టి నిరసన తెలపడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. మండల కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీ ఎదుట అర్ధరాత్రి నుంచే మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో బారులు తీరారు. సిలిండర్లు దొరుకుతాయో లేదో అన్న ఆందోళనతో చాలామంది ఏజెన్సీ కార్యాలయం ముందే పడుకున్నారు. తెల్లవారినా ఏజెన్సీ నిర్వాహకులు కార్యాలయానికి రాకపోవడం, వచ్చిన తర్వాత కూడా స్టాక్ లేదని చెప్పడంతో వినియోగదారుల ఓపిక నశించింది.
బుకింగ్ చేసినా దక్కని వైనం
చాలామంది వినియోగదారులు తాము ఎన్నో రోజుల క్రితమే గ్యాస్ సిలిండర్లు బుకింగ్ చేసుకున్నామని, అయినా సమయానికి సరఫరా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ నిర్వాహకులను అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదని, పదేపదే తిప్పుకుంటున్నారని మండిపడ్డారు. గ్యాస్ కొరత కారణంగా వంట చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కట్టెల పొయ్యిలపై ఆధారపడాల్సి వస్తోందని మహిళలు వాపోయారు.
రహదారిపై ధర్నా.. వాహనాల నిలిచివేత
సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆగ్రహించిన వినియోగదారులు ఖాళీ గ్యాస్ సిలిండర్లతో జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. రోడ్డుకు అడ్డంగా సిలిండర్లు పెట్టి రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందిించి గ్యాస్ కొరతను తీర్చాలని, ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా కారణంగా జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వినియోగదారులతో చర్చలు జరుపుతున్నారు.

