నేల పరిరక్షణతోనే మేలైన దిగుబడులు
కూసుమంచి మండలంలో ఘనంగా రైతు వారోత్సవాలు
అన్నదాతలకు సాగు మెళకువలపై అవగాహన
కాకతీయ, కూసుమంచి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా కూసుమంచి మండలంలోని ఎనిమిది క్లస్టర్ల పరిధిలోని రైతు వేదికల్లో సోమవారం రైతు వారోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కూసుమంచి రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి (ఏవో) రామడుగు వాణి పాల్గొని రైతులకు సాగుపై దిశానిర్దేశం చేశారు.
భూసార పరీక్షల ఆధారంగానే ఎరువులు..
ఈ సందర్భంగా ఏవో వాణి మాట్లాడుతూ.. రైతులు విచక్షణారహితంగా ఎరువులు వాడకుండా, భూసార పరీక్షల ఆధారంగానే ఎరువులను వినియోగించాలని సూచించారు. నేల పరిరక్షణ, మట్టి నమూనాల సేకరణ ప్రాధాన్యతను వివరిస్తూ.. పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల భూమిలోని మిత్రపురుగులు నశించి నేల నిస్సారమవుతుందని హెచ్చరించారు. విత్తనాల కొనుగోలులో రైతులు అప్రమత్తంగా ఉండాలని, పచ్చి రొట్ట ఎరువుల సాగుపై దృష్టి సారించాలని కోరారు.
ప్రకృతి వ్యవసాయంపై మక్కువ పెంచుకోవాలి..
సర్పంచ్ కృష్ణవేణి మాట్లాడుతూ.. అన్నదాతలు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలని, వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తూ తక్కువ పెట్టుబడితో లాభాలు గడించాలని సూచించారు. అనంతరం టెక్నికల్ ఏవో అరుణ వేసవి లోతు దుక్కుల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా అధికారులు మట్టి నమూనాల సేకరణ విధానాన్ని క్షేత్రస్థాయిలో రైతులకు చేసి చూపించారు. నేలను పరిరక్షించుకుంటామని రైతులందరితో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో భూసార పరీక్ష కేంద్రం ఏవో రామారావు, ఉప సర్పంచ్ వెంకట రమణ, వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవోలు) జానీ, సాయిరాం, సౌమ్య, నవీన్, రవి కుమార్, ప్రియాంక, రవీందర్ మరియు వివిధ గ్రామాల సర్పంచులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

