దమ్ముంటే రైతు ఉత్సవాలు నిర్వహించాలి
వ్యవసాయ మార్కెట్లలో ధాన్యం మొక్కజొన్న రైతుల అవస్థలు
కొనుగోలు చేసిన సరుకును తరలించలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం
బార్ దాన్లు తంబుల పేరుతో అన్నదాతల నుంచి అక్రమ వసూళ్లు
వరంగల్ డిక్లరేషన్ హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
కాకతీయ, వరంగల్ : దమ్ముంటే రైతు ఉత్సవాలను అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాకుండా వ్యవసాయ మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. సోమవారం వరంగల్ ఏనుమాముల మార్కెట్‌ను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ లో ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం బార్ దాన్లు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. రైతులు పండించిన సరుకును కొనుగోలు చేసినప్పటికీ, వాటిని తరలించడానికి వాహనాలు సమకూర్చకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఒక్కో రైతు 25 రోజులుగా కాంటాల కోసం ఎదురుచూడడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో బార్ దాన్లను అమ్ముకుంటూ, తంబుల పేరుతో రైతుల నుంచి 5 వేల నుంచి 10 వేల రూపాయల వరకు దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుబంధు, రైతుబీమా అమలు చేయకుండా అన్నదాతల నోట్లో మట్టి కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముట్టడిస్తామని హెచ్చరిక
ఈ నెల 6వ తేదీ నాటికి రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ ప్రకటించి మూడేళ్లు పూర్తవుతోందని, ఆ హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో అకాల వర్షాలతో పంట నష్టపోతే ఎకరాకు 10 వేల రూపాయల నష్టపరిహారం ఇచ్చి ఆదుకున్నామని గుర్తు చేశారు. ఈ నెల 6వ తేదీలోపు ఏనుమాముల మార్కెట్ లోని మక్కలను కొనుగోలు చేయకపోతే రైతులతో కలిసి ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ఉత్సవాల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం ఆపాలని డిమాండ్ చేశారు.

