నల్లాల బావికి కొత్త మోటార్
ఎమ్మెల్యే సహకారంతోనే అభివృద్ధి
రూ.1.10 లక్షల వ్యయంతో సెట్ మంజూరు
ప్రారంభించిన డీసీసీ ఉపాధ్యక్షులు అశోక్ గౌడ్
కాకతీయ, ఇనుగుర్తి: స్థానిక ఎమ్మెల్యే డా. భూక్యా మురళీ నాయక్ సహకారంతో మండలంలోని గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బైరు అశోక్ గౌడ్ అన్నారు. ఇనుగుర్తి మండలం చిన్న నాగారం గ్రామంలోని నల్లాల బావికి ఎమ్మెల్యే నిధుల నుంచి మంజూరైన కొత్త విద్యుత్ మోటారు, స్టార్టర్, పైపుల సెట్‌ను సోమవారం గ్రామ పంచాయతీ పాలక మండలి సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. గత 25 ఏళ్లుగా బావి మోటారు తరచూ మరమ్మతులకు గురవుతూ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ విన్నపం మేరకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి రూ.1.10 లక్షల విలువైన కొత్త మోటార్ సెట్‌ను మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చొరవతో గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్ల నిర్మాణం వంటి పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యేకు గ్రామస్థుల తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచి చెడుపాక సుజాత యాకయ్య, ఉపసర్పంచి తుమ్మనపల్లి సతీష్ చారి, వార్డు సభ్యులు బైరు వెంకటేశ్వర్లు, నాయకులు బైరు శ్రీనివాస్ గౌడ్, చిన్న కుమార్ రెడ్డి, చెడుపాక జంపయ్య మరియు జీపీ సిబ్బంది పాల్గొన్నారు.

