నిలిచిన మొక్కజొన్న దిగుమతులు
నల్లబెల్లి మండలంలో రైతుల రాస్తారోకో
కాకతీయ, నల్లబెల్లి: హమాలీలకు బకాయిలు చెల్లించకపోవడంతో గోదాముల వద్ద మొక్కజొన్న దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో పంటను విక్రయించలేక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గన్నీ సంచులు, హమాలీలు, వాహన ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పినా, క్షేత్రస్థాయిలో మాత్రం లంచాల రాజ్యమే నడుస్తోందని రైతులు ఆరోపించారు. పీఏసీఎస్ (PACS) సిబ్బందితో దళారీలు కుమ్మక్కై క్వింటాలుకు కేవలం రూ.1600 నుండి రూ.1800లకే కొనుగోలు చేస్తూ తమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పంటను తీసుకోకుండా, ట్రక్ సీట్లు దళారీల ట్రాక్టర్లకే కేటాయిస్తున్నారని మండిపడ్డారు.
నెలరోజులుగా పడిగాపులు
మద్దతు ధర రూ.2,400 ఇస్తామన్న ప్రభుత్వ హామీ నమ్మి తాము కళ్లాల వద్ద నెలరోజులుగా పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాస్తారోకోతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తహసీల్దార్ ముప్పు కృష్ణ, ఎస్సై సాయి ప్రసన్నకుమార్ రంగప్రవేశం చేశారు. హమాలీలు, పీఏసీఎస్ సిబ్బందితో మాట్లాడి బకాయిల సమస్యను తాత్కాలికంగా పరిష్కరించడంతో రైతులు శాంతించారు. ఈ నిరసన కార్యక్రమంలో నల్లబెల్లి మండల రైతులు, పీఏసీఎస్ ప్రతినిధులు, తహసీల్దార్ ముప్పు కృష్ణ, ఎస్సై సాయి ప్రసన్నకుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

