నిత్య విద్యార్థిగా ఉండాలి..
నైపుణ్యం పెంపొందించుకుంటేనే అవకాశాలు
జాబ్ మేళాలో యువతకు మంత్రి సురేఖ సూచనలు
కాళోజీ కళాక్షేత్రంలో భారీ జాబ్ మేళా విజయవంతం
4,000 మందికి ఉపాధి అవకాశాలు.. 72 కంపెనీల భాగస్వామ్యం
ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు, కుడా చైర్మన్ ఇనుగాల
కాకతీయ,వరంగల్ బ్యూరో/ వరంగల్ ప్రతినిధి : యువత ఎప్పుడూ నేర్చుకునే తపనతో నిత్య విద్యార్థిలా ఉండాలని, అప్పుడే మారుతున్న కాలానికి అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకోగలరని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ’99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి భారీ జాబ్ మేళాను ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాను ఇప్పటికే ఎంబీఏ పూర్తి చేసి, ప్రస్తుతం డాక్టరేట్‌కు సిద్ధమవుతున్నానని పేర్కొంటూ యువతలో స్ఫూర్తి నింపారు. మహిళా అభ్యర్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారికి స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా ఆమె కంపెనీల ప్రతినిధులను కోరారు. గతంలో నిర్వహించిన మేళా ద్వారా 11,600 మందికి ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.

72 కంపెనీలు.. 4 వేల ఉద్యోగాలు
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో లేఆఫ్స్ జరుగుతున్న తరుణంలో, 72 ప్రముఖ కంపెనీలు ఏకంగా 4,000 ఉద్యోగ అవకాశాలతో ముందుకు రావడం గొప్ప విషయమని ఎంపీ కడియం కావ్య అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా నిర్వహించిన ఈ మేళాకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు తరలివచ్చారు.
నైపుణ్యమే విజయ సూత్రం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించిందని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. మంత్రి కొండా సురేఖ చొరవతో జిల్లాలో ఇటువంటి భారీ మేళాలు నిర్వహించడం స్థానిక యువతకు వరం లాంటిదని పేర్కొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. కేవలం డిగ్రీలు ఉంటే సరిపోదని, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు సాంకేతిక నైపుణ్యం కలిగి ఉంటేనే ఉన్నత స్థాయికి చేరుకోగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి, అదనపు కలెక్టర్ వైవి గణేష్, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు మరియు పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

