మారుమోగిన రామ నామస్మరణ
రాయపర్తిలో మిన్నంటిన ఆధ్యాత్మిక ఉత్సాహం
కొండగట్టుకు బయలుదేరిన అంజన్న స్వాములు
కాకతీయ, రాయపర్తి : రాయపర్తి మండల కేంద్రంలోని పురాతన రామాలయం సోమవారం రామ నామస్మరణతో మారుమోగింది. హనుమాన్ మాలధారణ దీక్షలు ముగింపు దశకు చేరుకోవడంతో స్వాములు నిర్వహించిన ఇరుముడి కార్యక్రమం ఆధ్యాత్మిక ఉత్సాహంతో సాగింది. భక్తులు, మాలధారుల జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణమంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఆలయ అర్చకులు ఆరుట్ల శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో ఇరుముడి (ముడుపు) కట్టే కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. పవిత్రమైన నెయ్యి, నైవేద్య ద్రవ్యాలతో కూడిన ఇరుముడిని అర్చకులు అంజన్న మాలధారుల శిరస్సుపై ధరింపజేశారు. ఈ వేడుకను తిలకించేందుకు స్వాముల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇరుముడి అనంతరం స్వాములంతా కలిసి స్థానిక హనుమాన్ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీక్షా కాలం ముగియడంతో స్వాములు తమ మొక్కులు చెల్లించుకునేందుకు జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధికి బయలుదేరారు. ‘జై శ్రీరామ్.. జై జై హనుమాన్’ నినాదాల మధ్య స్వాములు వాహనాల్లో తరలి వెళ్తుండగా, గ్రామస్తులు మరియు కుటుంబ సభ్యులు వారికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది.

