కేదాసి మోహన్‌కు హ్యూమన్ రైట్స్ డిఫెండర్ పురస్కారం
కాకతీయ, గీసుగొండ: వరంగల్ జిల్లాకు చెందిన దళిత బిడ్డ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మానవ హక్కుల కార్యకర్త కేదాసి మోహన్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. గీసుగొండ మండలంలోని బొడ్డు చింతలపల్లి గ్రామానికి చెందిన ఆయనకు.. గోవాలో నిర్వహించిన అంతర్జాతీయ మానవ హక్కుల కార్యకర్తల సమావేశంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ (ఐహెచ్ఆర్ఎఫ్) 2026 సంవత్సరానికి గాను ‘హ్యూమన్ రైట్స్ డిఫెండర్’ అవార్డును అందజేసి ఘనంగా సత్కరించింది.
సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం కేదాసి మోహన్ నిరంతరం చేస్తున్న సేవలను గుర్తించి ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. నిరుపేద దళిత కుటుంబంలో జన్మించినప్పటికీ, ఆయన సామాజిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడుతున్నారని ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికపై కేదాసి మోహన్‌కు ఈ అవార్డు రావడం పట్ల జిల్లాకు చెందిన పలు రాజకీయ, సామాజిక, మానవ హక్కుల సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.

