సదరం సర్టిఫికెట్లు త్వరితగతిన అందజేయాలి
హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
ఎంజీఎం, కంటి ఆసుపత్రిలో ప్రత్యేక సదరం, యూడీఐడీ క్యాంపుల పరిశీలన
కాకతీయ, వరంగల్: హనుమకొండ జిల్లాలో దివ్యాంగుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక సదరం మరియు యూడీఐడీ క్యాంపులను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. నగరంలోని ప్రభుత్వ ఎంజీఎం ఆసుపత్రి, ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రిలలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపులకు కలెక్టర్ స్వయంగా వెళ్లి అక్కడ జరుగుతున్న వైద్య పరీక్షలు, అసెస్‌మెంట్ ప్రక్రియ, డేటా అప్‌లోడ్ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వీలైనంత త్వరగా అక్కడికక్కడే సదరం సర్టిఫికెట్లు జారీ చేసే విధానాన్ని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పర్యవేక్షించారు. దూరాభారాల నుండి వచ్చే దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సదరం సర్టిఫికెట్లు, యూడీఐడీ కార్డులను అత్యంత వేగంగా అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఎండల తీవ్రత దృష్ట్యా క్యాంపులకు వచ్చే దివ్యాంగుల కోసం చల్లని తాగునీరు, కూర్చోవడానికి కుర్చీలు, వీల్‌చైర్లు, ప్రత్యేక కౌంటర్లు తదితర మౌలిక సదుపాయాలు పక్కాగా కల్పించాలని సూచించారు. సదరం సర్టిఫికెట్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన అనంతరం, లబ్ధిదారుల డిజిటల్ యూడీఐడీ కార్డులను వారి ఇళ్లకు నేరుగా స్పీడ్ పోస్టు ద్వారా చేరేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. సమాజంలో వెనుకబడిన దివ్యాంగులకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, పారదర్శకంగా అందేలా వైద్యారోగ్య, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్యాంపుల పరిశీలన కార్యక్రమంలో డీఆర్‌డీఓ మేన శ్రీనివాస్, ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భరత్ కుమార్, ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ చంద్ర రెడ్డి, డీపీఎం (పెన్షన్స్) శ్రీనివాస స్వామి తదితర అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

