కార్మికుల వేతనాల పెంపులో చిత్తశుద్ధి లేదు
పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు లేవు
కేటగిరీల విభజనలో ఎలాంటి స్పష్టత లేదు
గత ప్రభుత్వ హయాం కంటే తక్కువగా వేతనాలు
మేనిఫెస్టోలోని కనీస వేతనాల హామీలను గాలికి వదిలేశారు
మూడు లక్షల మంది స్కీమ్ వర్కర్ల పరిస్థితి ఏంటి
ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి
బీఆర్ఎస్ నేత, మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్
కాకతీయ, హన్మకొండ : రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన కనీస వేతనాల పెంపులో ఎలాంటి శాస్త్రీయత లేదని, ఇది కార్మికుల ఆశలపై నీళ్లు చల్లేలా ఉందని బీఆర్ఎస్ నేత, మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు, ఇప్పుడు చేస్తున్న ఆచరణకు అస్సలు పొంతన లేదని ఆయన మండిపడ్డారు. హన్మకొండలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మిక సంఘాల డిమాండ్లను పూర్తిగా పట్టించుకోకుండా, కేబినెట్ సబ్ కమిటీ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేసిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన వేతనాల పెంపులో అన్ స్కిల్డ్ వర్కర్లకు తప్ప, మిగిలిన స్కిల్డ్, హైలీ స్కిల్డ్ కార్మికులకు పెద్దగా ప్రయోజనం లేదని వివరించారు. జీవో 4 ప్రకారం గతంలో స్కిల్డ్ కార్మికుడికి రూ.19,572 వేతనం ఉండగా, ఇప్పుడు ప్రకటించిన రూ.18,500 వల్ల సుమారు రూ.1,072 తగ్గినట్లు అయిందని ఆయన లెక్కలతో సహా వెల్లడించారు. కాంట్రాక్ట్ లేబర్ జీవో 11 ప్రకారం ఇప్పటికే కార్మికులు రూ.13,098 నుంచి రూ.23,683 వరకు పొందుతున్నారని, ప్రభుత్వం ఇప్పుడు పెంచిన జీతాలు వాస్తవానికి అదనంగా ఏమీ లేవని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో అన్ స్కిల్డ్ కార్మికుడికి కనీస వేతనం రూ.18,009 కి సిఫార్సు చేశామని, అలాగే మున్సిపల్ కార్మికుల వేతనాలను రూ.14,600 నుంచి రూ.22,000 కు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
హామీలను గాలికి వదిలేశారు
ఎన్నికల మేనిఫెస్టోలో కనీస వేతనం రూ.24,000 ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చిందని దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. డాక్టర్ అట్రాయి ఫార్ములా ప్రకారం నెలకు కనీసం రూ.32,000 వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెబుతున్నా, కార్మిక సంఘాలు రూ.26,000 డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం నామమాత్రపు పెంపుతో సరిపెట్టిందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, ఎన్ఆర్ఈజీఎస్, సర్వశిక్షా అభియాన్ వంటి విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 300000 మంది స్కీమ్ వర్కర్లను ఏ కేటగిరీలో చేరుస్తారో ప్రభుత్వం ఎక్కడా స్పష్టం చేయడం లేదని దాస్యం వినయ్ భాస్కర్ ప్రశ్నించారు. ప్రభుత్వం వారి భవిష్యత్తును పూర్తిగా అంధకారంలోకి నెట్టేసిందని ఆందోళన వ్యక్తం చేశారు.
పునఃసమీక్షించాల్సిందే
ప్రస్తుతం అందుతున్న వేతనాల కంటే తక్కువగా ఉన్న ఈ సవరణను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునఃసమీక్షించాలని దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. కార్మికులకు అన్యాయం జరగకుండా శాస్త్రీయంగా వేతనాలు పెంచాలని, లేనిపక్షంలో కార్మికుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

