వడదెబ్బతో వృద్ధుడు మృతి
చెరువులో మృతదేహం గుర్తింపు
మంగపేటలో ఎండల తీవ్రత
కాకతీయ, ఏటూరునాగారం: మంగపేట మండలంలోని రామచంద్రునిపేట గ్రామానికి చెందిన ఊటుకూరి సోమిరెడ్డి (78) వడగాలులకు బలైన ఘటన విషాదాన్ని మిగిల్చింది. శుక్రవారం పంటపొలాలకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాలేదు. శనివారం ఉదయం పూరెడుపల్లి చెరువుకు వెళ్లిన గ్రామస్తులు నీటిలో పడిఉన్న మృతదేహాన్ని గమనించి పరిశీలించగా అది సోమిరెడ్డిదిగా గుర్తించారు. తీవ్ర ఎండలు, వడగాలుల కారణంగా అస్వస్థతకు గురై చెరువులో పడిపోయి మృతి చెందినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మంగపేట మండలంలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుని ఎండల తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలో వడదెబ్బ కారణంగానే మృతి సంభవించి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. మృతుడికి భార్య జయమ్మ, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

