పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి
20 శాతం మాత్రమే వరి, మొక్కజొన్నల కొనుగోలు
రబీ సీజన్ ‘రైతు భరోసా’ ను రైతుల ఖాతాల్లో జమ చేయాలి
రూ.2 లక్షలు దాటిన రుణాలను రెండేళ్లయినా మాఫీ చేయని ప్రభుత్వం
కేంద్ర నిధులను వాడుకుంటూ నెపం నెడుతున్న రాష్ట్ర సర్కార్
బీజేపీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి
కాకతీయ, జూలూరుపాడు : రైతులు పండించిన వరి, మొక్కజొన్న పంటలకు తక్షణమే గిట్టుబాటు ధర కల్పించి పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ నివాసంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలో ఇప్పటివరకు కేవలం 20 శాతం మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసిందని, మిగిలిన ధాన్యాన్ని నిరుత్సాహపడిన అన్నదాతలు ప్రైవేట్ వ్యాపారస్తులకు తక్కువ ధరకే అమ్ముకుని నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన కొద్దిపాటి ధాన్యం, మొక్కజొన్నలు కూడా ఇంకా అక్కడే మురిగిపోతున్నాయన్నారు. వర్షాలు వచ్చే సూచనలు ఉన్నందున వాటిని వెంటనే గోదాములకు తరలించాలని డిమాండ్ చేశారు.
రైతు భరోసా, రుణమాఫీపై నిర్లక్ష్యం
రాబోయే ఖరీఫ్ (వానకాలం) సీజన్ దగ్గరపడుతున్నా, రబీ (యాసంగి)కి సంబంధించిన రైతు భరోసా పెండింగ్ పైసలను ప్రభుత్వం ఇంతవరకు రైతుల ఖాతాల్లో వేయలేదన్నారు. పానీ నకల్ ఆధారంగా రుణాలు తీసుకున్న రైతులకు మరియు 2018 కంటే ముందు బాకీలు ఉన్నవారికి ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదని విమర్శించారు. రూ.2 లక్షలు దాటిన రైతులకు బ్యాంకు రుణాలను మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటుతున్నా ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు.
ఎన్నికల హామీ ప్రకారం వ్యవసాయ కూలీలకు ఏటా ఇస్తానన్న రూ.12,000 లలో ఇంతవరకు ఒక్క నయాపైస కూడా ఇవ్వలేదని, అలాగే కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పి నేడు రాష్ట్రంలో ఏ ఒక్క కౌలు రైతుకూ పైసలు ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఎన్ని ఆందోళనలు చేపట్టినా ఈ మొండి ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ధాన్యం, మొక్కజొన్నలు వెంటనే కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేంద్రం మీదికి నెపం నెడుతోందని ధ్వజమెత్తారు. మద్దతు ధరతో పాటు గింజల రవాణా, బస్తాలు, పురికోస ఖర్చులు, కొనుగోలు చేసినందుకు గానూ కమిషన్ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రానికి అందిస్తోందని స్పష్టం చేశారు. సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్, మాజీ మండల అధ్యక్షులు సిరిపురపు ప్రసాద్, కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి పుల్లారావు, నాయకులు వెంకటేశ్వర్లు, నర్వనేని కృష్ణ తదితరులు పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

