మార్కెట్‌కు వరుసగా ఐదు రోజులు సెలవు
27 నుంచి 31 వరకు నిలిచిపోనున్న కొనుగోళ్లు
కాకతీయ, వరంగల్ : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కు వరుసగా ఐదురోజులు సెలవులు రానున్నాయి. మంగళవారం ఒక్క రోజు లావాదేవీలు జరగనుండగా, ఈ నెల 27 నుంచి 31 వరకు వరుసగా కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు వరంగల్ మార్కెట్ అధికారులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం మార్కెట్ కొనసాగనుండగా, బుధవారం రోజున కొంతకాలంగా సెలవు పాటిస్తూ వస్తున్నారు. ఇక ఈ గురువారం బక్రీద్ పండుగ కావడంతో ఆ రోజు ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. వేసవి దృష్ట్యా ఎండలు తీవ్రత నేపథ్యంలో వ్యాపారులు శుక్రవారం కూడా సెలవు ఇవ్వాలని అధికారులను కోరగా, శుక్రవారం సైతం మార్కెట్ బంద్ కానుంది. శనివారం, ఆదివారం వారాంతపు సెలవులు. ఈ లెక్కన బుధవారం నుంచి ఆదివారం వరకు ఐదు రోజులు వరుసగా మార్కెట్ బంద్ పాటిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జూన్ ఒకటో తేదీన మార్కెట్ తిరిగి తెరుచుకోనున్నా.. ఆ మరుసటి రోజు జూన్ రెండో తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కెట్ కు సెలవు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఆ మరుసటి రోజు బుధవారం కూడా బందే. మొత్తంగా జూన్ 4వ తేదీ నుంచి మార్కెట్ యధావిధిగా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రైతులు గమనించి.. మార్కెట్ అధికారులకు, వ్యాపారులకు సహకరించాల్సి ఉంటుంది.

