సర్వర్ మొరాయింపుతో రిజిస్ట్రేషన్లకు బ్రేక్!
కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మూడు రోజులుగా పడిగాపులు
తీవ్ర ఎండల్లో వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు
కార్యాలయంలో కనీస వసతులు లేవని ప్రజల ఆగ్రహం
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సాంకేతిక సమస్యలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గత మూడు రోజులుగా సర్వర్ మొరాయించడంతో ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా స్తంభించింది. దీంతో స్థలాలు, ఇళ్ల కొనుగోలు, విక్రయాల కోసం వచ్చిన ప్రజలు, దస్తావేజు లేఖరులు (డాక్యుమెంట్ రైటర్లు) గంటల తరబడి కార్యాలయం వద్దే వేచి చూడాల్సి వచ్చింది. ప్రస్తుతం నడుస్తున్న తీవ్ర ఎండల నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు కార్యాలయం చుట్టూ తిరుగుతూ అల్లాడిపోయారు. కార్యాలయంలో కూర్చునేందుకు సరిపడా సీట్లు, కనీసం తాగునీటి వసతి కూడా లేకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వర్ పనిచేయకపోవడంతో పత్రాల ధృవీకరణ నిలిచిపోయి కార్యాలయం వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం సాంకేతిక సిబ్బంది చొరవతో సర్వర్ సమస్య కొంతవరకు పరిష్కారం కావడంతో ఎట్టకేలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. తరచూ తలెత్తుతున్న ఇటువంటి సాంకేతిక సమస్యలకు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.


