కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం
నెల రోజులైనా కాంటాలు పెట్టే దిక్కులేదు
గన్నీ బస్తాలు, లారీల కొరతతో రైతుల ఇబ్బందులు
పెద్దవంగరలో బీఆర్ ఎస్ నేత ఐలయ్య ఆధ్వర్యంలో నిరసన
కాకతీయ, పెద్దవంగర : కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే నెలలు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతోందని బీఆర్‌ఎస్ మండల నాయకులు విమర్శించారు. సోమవారం మండల కేంద్రంలోని పలు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులతో కలిసి వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య మాట్లాడుతూ.. ఐపీసీ కొనుగోలు కేంద్రాల వద్ద ఎర్రటి ఎండలో రైతులు ఆగమవుతున్నా, ధాన్యం తీసుకొచ్చి నెల రోజులైనా కాంటాలు పెట్టే నాథుడే లేరని మండిపడ్డారు.
తరుగు పేరిట నిలువు దోపిడీ!
కేంద్రాల్లో కాంటా పెట్టేందుకు గన్నీ బస్తాలు లేవని, ఒకవేళ తూకం వేసినా మిల్లులకు తరలించేందుకు లారీలు రావడం లేదని ఐలయ్య ఆరోపించారు. దీనికితోడు తరుగు పేరిట, రవాణా ఖర్చుల నెపంతో అన్నదాతలను నిలువు దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఇలాంటి ఇబ్బందులు ఉండేవి కావని గుర్తుచేశారు. ఎర్రటి ఎండలో రైతులు పడిగాపులు కాస్తూ సహనం కోల్పోయి రోడ్లెక్కుతున్నా.. స్థానిక ఎమ్మెల్యే ఏ ఒక్క సెంటర్‌ను సందర్శించకపోవడం విచారకరమన్నారు. తక్షణమే ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సంజయ్, ఉపాధ్యక్షుడు వెంకన్న, నాయకులు సుధీర్, హరీష్, పటేల్ నాయక్, రాంమూర్తి, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

