రామారావు హంతకులను అరెస్టు చేయాలి!
సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఎం రాష్ట్ర బృందం వినతి
రాజకీయ కక్షతోనే కిరాతక హత్య : భార్య స్వరాజ్యం ఆవేదన
సానుకూలంగా స్పందించిన సీఎం.. చర్యలకు ఆదేశం
కాకతీయ, చింతకాని : సీపీఎం రాష్ట్ర నేత, ఉమ్మడి ఉభయ రాష్ట్రాల రైతు సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి సామినేని రామారావు హత్య కేసు నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆ పార్టీ రాష్ట్ర బృందం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కోరింది. సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జగ్గుల జాన్ వెస్లీ ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధులు, రామారావు సతీమణి సామినేని స్వరాజ్యం సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఏడు నెలలు గడుస్తున్నా దక్కని న్యాయం!
చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సామినేని రామారావును గతేడాది అక్టోబర్ 31న అదే గ్రామానికి చెందిన బొర్రా ప్రసాద్, కంచుమర్తి రామకృష్ణ, మద్దినేని నాగేశ్వరరావు, కాండ్ర పిచ్చయ్య, కొత్తపల్లి వెంకటేశ్వర్లు తదితరులు కత్తులతో పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశారని వినతిపత్రంలో పేర్కొన్నారు. రామారావు బతికుంటే పాతర్లపాడులో సీపీఎంను ఓడించడం సాధ్యం కాదనే రాజకీయ కక్షతోనే ఈ కుట్రకు పాల్పడ్డారని వివరించారు. హత్య జరిగి ఏడు నెలలు గడుస్తున్నా, ప్రత్యక్ష సాక్షిగా తానే స్వయంగా నిందితుల పేర్లు చెప్తూ చింతకాని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు పోలీసులు వారిని అరెస్టు చేయలేదని రామారావు భార్య స్వరాజ్యం ఆవేదన వ్యక్తం చేశారు.
పేదల పక్షపాతి..
రామారావు సుమారు 50 ఏళ్ల పాటు సీపీఎంలో, ప్రజాసంఘాలలో నిస్వార్థంగా పనిచేశారని పార్టీ నేతలు గుర్తుచేశారు. పాతర్లపాడుకు ఆయన రెండుసార్లు ఏకగ్రీవ సర్పంచ్‌గా, ఆయన సతీమణి స్వరాజ్యం ఒకసారి సర్పంచ్‌గా సేవలందించారని తెలిపారు. పేదల కోసం సొంత భూమినే ఇళ్ల స్థలాలుగా పంచిన మహోన్నత వ్యక్తి రామారావు అని కొనియాడారు. ఆయన ఉంటే తమ ఆటలు సాగవని భావించిన సంఘ విద్రోహ శక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారని, హంతకులను, సూత్రధారులను వెంటనే జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. సీఎంను కలిసిన వారిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, టి.జ్యోతి, పోతినేని సుదర్శన్ రావు, మల్లు లక్ష్మి, తీగల సాగర్, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, మడిపల్లి గోపాలరావు ఉన్నారు.

