బక్రీద్ బందోబస్తుపై సీపీ సమీక్ష
విజిబుల్ పోలీసింగ్‌తో అప్రమత్తంగా ఉండాలి
వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్
ధాన్యం సేకరణ కేంద్రాలపైనా నిఘా పెట్టాలని ఆదేశాలు
కాకతీయ, హనుమకొండ : కమిషనరేట్ పరిధిలో బక్రీద్ పండుగకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనరేట్ కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన సమీక్షించారు. ప్రార్థనా స్థలాల వద్ద విజిబుల్ పోలీసింగ్ ఉండాలని, గోవుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటివరకు చెక్‌పోస్టుల ద్వారా 11 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. స్టేషన్ స్థాయిలో పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని, పాత నేరస్తులను బైండోవర్ చేయాలని సూచించారు. గ్రామీణ సంతల్లో పశువుల విక్రయాలపై నిఘా పెట్టాలన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వధశాలల వ్యర్థాల తరలింపునకు మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ధాన్యం సేకరణ కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సీపీ సన్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. ధాన్యం సేకరణ, రవాణా, గోదాముల నిల్వ సామర్థ్యంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రవాణా కోసం అవసరమైన లారీల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో డీసీపీలు అంకిత్ కుమార్, దారా కవిత, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

