రైతన్నకు ‘రాజన్న’ భరోసా!
అధికారుల సాకులకు ఎమ్మెల్యే చెక్!
లారీలు, కూలీల కొరత పేరిట చేతులెత్తేసిన అధికారులు
హమాలీలకు రూ. 10,20,000 అదనపు సాయం ప్రకటన
నాలుగు మండలాల్లో భారీ గోదాముల నిర్మాణానికి ఆదేశాలు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినుల ప్రతిభకు రూ.32 లక్షల సొంత నిధుల పంపిణీ
అండగా నిలుస్తున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై ప్రశంసల వర్షం
కాకతీయ,తెలంగాణ బ్యూరో : మునుగోడు నియోజకవర్గంలో ఐలపట్నం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం సేకరణలో సాగుతున్న జాప్యాన్ని, అధికారుల ఉదాసీనతను ఎండగడుతూ స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొలిటికల్ గ్రౌండ్ లోకి నేరుగా ఎంట్రీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో లారీలు లేవు, బస్తాలు లేవు, కూలీలు దొరకడం లేదు అంటూ అధికారులు చేతులెత్తేయడంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నలు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయిన ఆయన.. నేనున్నాను అంటూ కొనుగోలు కేంద్రాల వద్దకు చేరుకుని బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై సీరియస్ ఫైర్ అయ్యారు. ఇకపై ఎలాంటి సాకులు చెబితే ఊరుకునేది లేదని, ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఆటంకాలు రావొద్దని గట్టిగా హెచ్చరించారు.

సొంత నిధులతో అండ.. హమాలీలకు అదనపు కూలీ
రైతన్న కష్టం వృథా కావొద్దని, అకాల వర్షాలకు ఒక్క గింజ కూడా తడవొద్దని స్పష్టం చేసిన రాజగోపాల్ రెడ్డి, అధికారులపై ఒత్తిడి పెంచడంతో పాటు తన పెద్ద మనసు చాటుకున్నారు. ధాన్యం తూకం, లోడింగ్ పనులు వేగవంతం చేసేందుకు రైతుల వడ్ల కోసం రూ. 10,20,000 విరాళం ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చే కూలీ కంటే అదనంగా హమాలీలకు తన సొంత డబ్బులతో సహాయం అందిస్తానని ప్రకటించి రైతు గుండెల్లో రారాజుగా నిలిచారు. మరోవైపు నియోజకవర్గంలో తీవ్రంగా ఉన్న గోదాముల కొరతపై కూడా ఆయన ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మునుగోడు, చౌటుప్పల్, నారాయణపూర్, నాంపల్లి మండలాల్లో భారీ గోదాముల నిర్మాణానికి వెంటనే అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థినులకు ప్రోత్సాహకాలు.. రైతాంగం హర్షం
కేవలం రైతుల సమస్యలపైనే కాకుండా సామాజిక బాధ్యతలోనూ రాజగోపాల్ రెడ్డి తన మార్క్ చూపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని, పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులను ప్రోత్సహించేందుకు తన సొంత నిధుల నుంచి ఏకంగా రూ. 32 లక్షల నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఇటు విద్యార్థులకు భరోసా ఇస్తూ, అటు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బంది పడుతున్న అన్నదాతలకు ఆర్థికంగా, ధైర్యంగా అండగా నిలవడంతో మునుగోడు నియోజకవర్గ రైతాంగం ఎమ్మెల్యేపై హర్షం వ్యక్తం చేస్తోంది. అధికారుల అలసత్వాన్ని పక్కనబెట్టి, రైతుల కష్టాన్ని నిజంగా అర్థం చేసుకుని ఆదుకున్న అసలైన నాయకుడు మా రాజగోపాల్ రెడ్డి అంటూ క్షేత్రస్థాయిలో కొనియాడుతున్నారు.

