డీసిల్టింగ్ వ్యవస్థను రద్దు చేయాలి
డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత
ఏఎన్ఎస్ ఆధ్వర్యంలో 2 గంటల పాటు రాస్తారోకో
కాకతీయ, నూగూరు వెంకటాపురం : డీసిల్టింగ్ వ్యవస్థను వెంటనే రద్దు చేసి, పూర్వపు పద్ధతినే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి నవనిర్మాణ సేన (ఏఎన్ఎస్) ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై మహిళలు, రైతులు, మత్స్యకారులు భారీ రాస్తారోకో నిర్వహించారు. క్యూబిక్ మీటర్ ఇసుకకు 400 రూపాయలు చెల్లించాలని, డీఎల్ఎస్సీ నిర్వహించాలని కోరుతూ సుమారు రెండు గంటల పాటు రహదారిపై బైఠాయించారు. దీంతో సమాచారం అందుకున్న స్థానిక డిప్యూటీ తహసీల్దార్ మహేందర్ ఘటనా స్థలానికి చేరుకోగా, నిరసనకారులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసి నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కోర్స నరసింహమూర్తి మాట్లాడుతూ.. ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అట్టం సుభద్ర, ఈర్ల పద్మ, ముర్రం రాజేష్, కుంజ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

