ఫైరవీలకే పోలీసుల ప్రాధాన్యం
సామాన్యుల కేసులను పట్టించుకోవడం లేదు
నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ నేతలకు రెడ్ కార్పెట్
కాంగ్రెస్ నేత రాగుల జగన్ సంచలన ఆరోపణలు
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : ప్రజలకు న్యాయం చేయాల్సిన సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ప్రస్తుతం రాజకీయ ఫైరవీలకు కేంద్రంగా మారిపోయిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రాగుల జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ నాయకుల పెత్తనం, అధికార దుర్వినియోగం యథేచ్ఛగా కొనసాగుతోందని ఆరోపించారు. మంగళవారం సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆయన మీడియా ముందు వెల్లడించారు. తనకు పరిచయమున్న ఓ వ్యక్తి అవసరాల కోసం డబ్బులు అడగడంతో ఫోన్‌పే ద్వారా పంపించానని, అయితే తిరిగి ఇస్తానన్న గడువు ముగిసినా ఇవ్వకపోవడంతో ఏప్రిల్ 15న సిరిసిల్ల సీఐ శ్రీనివాస్‌కు పిటిషన్ అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసును ఎస్ఐ శంకర్ నాయక్‌కు బదిలీ చేయగా, సదరు వ్యక్తిని స్టేషన్‌కు పిలిపించి విచారించారు. అప్పట్లో రూ.20 వేలు చెల్లించిన ఆ వ్యక్తి.. మిగిలిన రూ.66 వేలను నెల రోజులలోపు ఇస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చాడన్నారు. అయితే గడువు పూర్తయినా మిగిలిన డబ్బులు చెల్లించకపోవడంతో తిరిగి సీఐని కలిసేందుకు స్టేషన్‌కు వెళ్లినప్పటికీ తనను పట్టించుకోలేదని రాగుల జగన్ ఆరోపించారు. ఇదే సమయంలో అక్రమ ఫైనాన్సియర్లపై దాడుల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు స్టేషన్‌కు చేరుకోగా, సీఐ శ్రీనివాస్ వారితో ముచ్చట్లలో నిమగ్నమై తనను దాదాపు రెండు గంటల పాటు వేచి ఉండేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నా లాంటి మాజీ ప్రజాప్రతినిధికే ఈ పరిస్థితి ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కొంతమంది అధికారులు ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకుల కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని విమర్శించారు. వెంటనే జిల్లా ఎస్పీ జోక్యం చేసుకుని బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాగుల జగన్ డిమాండ్ చేశారు.

