చెరువుల మట్టి లూటీ
చెరువుల నుంచి ఇటుక బట్టీలకు తరలుతున్న మన్ను
ములుగు మండలంలో లంబడిపల్లి, ఇంచర్ల గ్రామాల్లో యథేచ్ఛగా దందా
ఎలాంటి అనుమతుల్లేకుండానే రాత్రింబవళ్లు తోలకాలు
బట్టీల వద్ద కొండల్లా పేరుకుపోయిన నిల్వలు.. పట్టించుకోని యంత్రాంగం
రైతుల పొలాలకైతే ఆంక్షలు.. ఇటుక వ్యాపారులకు మాత్రం రాయితీలా?
అధికారుల వైఖరిపై ప్రజల నుంచి వినిపిస్తున్నవ్యతిరేక స్వరాలు
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మండల వ్యాప్తంగా చెరువులు ఇటుక బట్టీలకు మట్టి వనరులుగా మారిపోతున్నాయి. నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టి ఇటుక బట్టి యజమానులు చెరువులను తమ ఆధీనంలోకి తీసుకొని భారీ స్థాయిలో మట్టిని తవ్వి భట్టీలలో నిల్వ చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. రోజుల తరబడి చెరువులలో మట్టి తవ్వకాలు చేపడుతున్న రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల నిర్లక్ష్యంతో ఈ అక్రమ వ్యవహారం రోజురోజుకూ విస్తరిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములుగు మండలంలో అనేక చెరువుల్లో జెసిబిల సహాయంతో వందల కొద్దీ ట్రాక్టర్లు, టిప్పర్లలో మట్టిని తరలిస్తూ ఇటుక బట్టీల వద్ద ముందస్తుగా నిల్వ చేస్తున్నారు. చెరువులో మట్టి తవ్వకాలకు సంబంధించి ఎలాంటి అధికారిక అనుమతులు లేకపోయినా, ఇటుక బట్టీల యజమానులు ధైర్యంగా పనులు కొనసాగించడం అధికారుల పర్యవేక్షణ లోపాన్ని స్పష్టంగా చూపిస్తోంది. సాధారణంగా చెరువుల్లో మట్టి తవ్వాలంటే అనుమతులు తప్పనిసరి అయినప్పటికీ, ఈ నియమాలు కేవలం రైతులకే వర్తిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటుక బట్టీల నిర్వహణకు చెరువులోని మట్టి ఉపయోగకరంగా ఉండటంతో పగలు, రాత్రి తేడా లేకుండా ఇష్టానుసారం నిబంధనకు విరుద్ధంగా చెరువులు నుండి మట్టిని తరలించుకుపోతున్న అధికారులు పట్టనట్టు వ్యవహరించడం పై స్థానికులు పలు విమర్శలు లేవనెత్తుతున్నారు.

రైతులకు ఒక నిబంధన… బట్టీలకు మరో నిబంధనా..?
రైతులు తమ పొలాల సారాన్ని పెంచుకోవడానికి చెరువు మట్టిని వినియోగించాలంటే పలు అనుమతుల కోసం అధికారుల వెంట తిరిగి అనుమతులు తీసుకోవాల్సి వస్తున్నప్పటికీ ఇటుక బట్టి యజమానులు మాత్రం ఎలాంటి అనుమతి లేకుండానే భారీగా మట్టిని తవ్వడం, నిల్వ చేయడం జరుగుతోంది. జంగాలపెల్లి పరిసరాలలోని లంబడిపల్లి గ్రామం శివారు ప్రాంతంలో ఒక ఇటుక పట్టి వ్యాపారి భారీగా సమీపంలోని చెరువు నుండి మట్టిని తోడి నిలువచేసిన ఎవరు పట్టించుకోకపోవడం, ఇంచర్ల గ్రామంలో ఇటుక బట్టీల వ్యాపారి చెరువులోని మట్టి టిప్పర్ల ద్వారా తమ బట్టీలో భారీ మట్టి కుప్పలు నిలువ చేసిన చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మట్టి తవ్వకాలపై సదరు ఇటుక బట్టి వ్యాపారులను ప్రశ్నించిన గ్రామస్థులపై కొందరు యజమానులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చెరువుల పరిరక్షణకు ముప్పు
చెరువులు గ్రామీణ వ్యవసాయానికి ప్రాణాధారం వంటివి అయితే అధికంగా మట్టి తవ్వడం వల్ల చెరువుల నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉంది. నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం, భూగర్భ జలాలపై ప్రతికూల ప్రభావం పడటం వంటి సమస్యలు తలెత్తే అవకాశముంది. దీర్ఘకాలంలో ఇది రైతాంగానికి తీవ్ర నష్టాన్ని కలిగించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంత పెద్ద స్థాయిలో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నప్పటికీ, సంబంధిత రెవెన్యూ మరియు ఇరిగేషన్ శాఖలు స్పందించకపోవడం పట్ల స్థానికుల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల అనుమతి లేకుండా ఇంత పెద్ద స్థాయిలో తవ్వకాలు జరుగుతాయా ? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొందరు యజమానులకు అధికారులతో సత్సంబంధాలు ఉండటమే ఈ పరిస్థితికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ మట్టి తవ్వకాలను వెంటనే ఆపాలని, చెరువుల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తవ్విన మట్టిపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

